తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో స్పందించారు. కేంద్ర మంత్రివర్గం తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రద్దీని తగ్గించడంతోపాటు, యాత్రికులు, పర్యాటకులకు ట్రైన్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అన్నారు. అంతేకాకుండా సరుకు రవాణా సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో రైల్వే సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రధాని ట్వీట్ కు ఏపీ సీఎం చంద్రబాబు బదులిచ్చారు. ఈ రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ. 1,332 కోట్లు మంజూరు చేసినందుకు ఏపీ ప్రజల తరపున, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లకు, కేంద్ర మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఈ ప్రాజెక్టుతో తిరుపతి బాలాజీ ఆలయం, శ్రీకాళహస్తి శివాలయం , చంద్రగిరి కోట వంటి పవిత్ర స్థలాలను అనుసంధానం చేసేందుకు వీలవుతుందని అంతేకాకుండా, ఇది వెల్లూరు, తిరుపతి వంటి విద్యా, వైద్య కేంద్రాలకు రాకపోకలను సులభతరం చేస్తుందనీ పేర్కొన్నారు . ఇది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, సిమెంట్, స్టీల్ పరిశ్రమల వృద్ధిని వేగవంతం చేస్తుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు, ఈ రైల్వే కనెక్టివిటీ, అభివృద్ధి యొక్క కొత్త శకానికి నాంది పలుకుతుందని చంద్రబాబు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.
తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పై ప్రధాని మోడీ ట్వీట్…స్పందించిన ఏపీ సీఎం
By admin1 Min Read