రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం వెన్నెముకలా నిలిచిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉపాధి శ్రామికులతో మేడే దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ శ్రామికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈసందర్భంగా స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల మందికి సొంత ఊళ్లలోనే ఉపాధి కలుగుతోందని అన్నారు. నీటి సంక్షోభ నివారణకు ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తామని చెప్పారు.శిథిలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పంచాయతీరాజ్ నిధులే ప్రాణంపోశాయని పేర్కొన్నారు . మద్యం అమ్మకాల్లో గత పాలకులు రూ. 3200 కోట్లు నొక్కేశారని విమర్శించారు.సారాయి సాణువుల మీద కోట్లు కూడబెట్టారని ఆక్షేపించారు.
ప్రతి ఒక్కరు బాధ్యతగా నీటిని వినియోగించాలని ఈసందర్భంగా పిలుపునిచ్చారు. నీటి పరిరక్షణపై పాఠశాల, కాలేజీ విద్యార్థులతో అవగాహన ర్యాలీలు, ప్రచారాలు చేయిస్తామని పేర్కొన్నారు. ప్రకృతి నుండి వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుంటాం. వేసవిలో విద్యార్థులకు, యువతకు నీటి సంరక్షణలో అవగాహనా కార్యక్రమాల్లో భాగం చేస్తామని తెలిపారు. వారికి వేసవి ఇంటర్న్ షిప్ ద్వారా గౌరవ వేతనాలు, సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు . నీటి సంరక్షణ, నీటి వనరుల పర్యవేక్షణ తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలో వీరి సహకారం తీసుకుంటామని వివరించారు . 13,326 పంచాయతీలు బాధ్యత గా పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకోగలుగుతామని అన్నారు.
ఉపాధి హామీ శ్రామికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం పవన్
By admin1 Min Read