పాడేరు మండలం వంజంగిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు మంత్రి సంధ్యా రాణి గారు, స్థానిక గిరిజన మహిళలు రాఖీ కట్టారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేను మీ మనిషిని.. గిరిజనులకు న్యాయం చేసే బాధ్యత నాది.. ఆ బాధ్యత తీసుకుంటున్నా మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్తా, గిరిజన ప్రాంతాల్లో మా గిరిజన బిడ్డలకే, టీచర్ ఉద్యోగాలు వచ్చేలా పోరాడతానని చంద్రబాబు అన్నారు. మొట్టమొదటి సారిగా గిరిజన ప్రాంతాల్లో, గిరిజనులకు మాత్రమే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేలా జీవో ఇచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన వాదనలు వినిపించక కోర్టులో జీవో కొట్టేసారని అన్నారు. మళ్ళీ తాను 2000వ సంవత్సరంలో గిరిజనులకు 100% రిజర్వేషన్ ఇవ్వటమే కాక, అందులో కూడా 33% ఆడబిడ్డలకు ఇస్తూ జీవో 3 ఇచ్చాన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 2020లో జగన్ అసమర్ధ పాలనలో, సరైన వాదనలు వినిపించలేక, సుప్రీం కోర్టులో ఈ జీవో కొట్టేసారని పేర్కొన్నారు. 4 ఏళ్ళు జగన్ రెడ్డి కనీసం ఈ కేసు గురించి పట్టించుకోకుండా గిరిజనులకు అన్యాయం చేసాడని విమర్శించారు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతం. మళ్లీ జన్మ ఉంటే ఇక్కడ పుట్టాలని అనుకుంటున్నా. స్వచ్ఛమైన, అందమైన కొండలు దర్శనమిచ్చాయి.మంచి మనసు ఉండే ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యామని పేర్కొన్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వనదేవత మోదకొండమ్మను దర్శించుకున్నారు. గ్రామంలోని కాఫీ తోటలను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ప్రజావేదిక వద్ద గిరిజన ప్రాంతంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం…గిరిజనులకు న్యాయం చేసే బాధ్యత నాది: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read