రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు మీడియా సమావేశం నిర్వహించారు. బియ్యం అక్రమ రవాణా గురించి వివరించారు. ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు, శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకు బియ్యం తరలించే పకడ్బందీ కుట్ర చేశారని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఏ పోర్టులో లేని విధంగా కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతి జరిగింది.కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాల నుండి ఎగుమతి చేసింది 1,31,18,346 మెట్రిక్ టన్నులని తెలిపారు. ఒక్క కాకినాడలో జరిగిన దీని విలువ 48,537 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు ఇస్తే దాదాపు 6,300 కోట్ల రూపాయల బియ్యం లెక్కలు చూపించి ఇక్కడ నుండి తరలించేసారని ఆక్షేపించారు.
ప్రభుత్వానికి ప్రతి కిలోకి 43.40 రూ ఖర్చయ్యే ఈ బియ్యాన్ని వీళ్ళు క్షేత్ర స్థాయిలో 10 రూలకే తీసుకుని వెళ్ళిపోడం, చాలా చోట్ల సరైన సమయానికి రాలేదు కాబట్టి వ్యాను వెళ్ళిపోయింది సరుకు ఇవ్వము అని చెప్పడం, చివరికి ఎంఎల్ఏ పోయింట్ల దగ్గర నుండి కూడా గోతాలకు గోతాలు తీసుకుపోయిన సందర్భాలు ఎన్నో స్పష్టంగా ఆధారాలతో దొరికాయని తెలిపారు. ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో కుట్ర చేసి దోచుకు తింటుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కాకినాడకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇదేమి ఒక వ్యక్తిపై కక్ష కట్టినట్టు కాదు. గత పాలనలో ముఖ్యమంత్రి అయిన జగన్ కి తెలియకుండా జరగదు కదా ఈ దోపిడీ ? అని ప్రశ్నించారు. అరబిందో రియాల్టీ కి కాకినాడ సీపోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది ? ఏ సందర్భంలో చేసింది ? కచ్చితంగా బైటకు రావాలని అన్నారు.ప్రభుత్వం ఆస్తి, మన రాష్ట్ర వనరుల్లో భాగం అయిన కాకినాడ పోర్టుకు ఎవరినీ రానీయకుండా గత ఐదేళ్ళ ఒక పెద్ద కుట్ర చేశారని ఎందుకు కాకినాడ పోర్ట్ పైన మనం దృష్టి సారించడం అనేది అందరూ తెలుసుకోవాలని అన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎవ్వరినీ పోర్టు లోపలికి అనుమతించలేదు.లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, అధికారులు ఎవరున్నారు, ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలుసుకోడానికి మీడియా వారిని కూడా అనుమతించలేదని మనోహర్ పేర్కొన్నారు.
ఏపీలో ఏ పోర్టులో లేని విధంగా కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతి జరిగింది:మంత్రి నాదెండ్ల మనోహర్
By admin2 Mins Read