కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయిందని ‘ఎక్స్’ వేదికగా దుయ్యబట్టారు.
ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండాపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారని ఆక్షేపించారు.
మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారన్నారు. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. 75 కిలోల బస్తాకు రూ.1725ల చొప్పున ఏ ఒక్కరికీ అందే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు.ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయ్యింది. రంగుమారిపోయే పరిస్థితి ఏర్పడింది. తుఫాను వస్తుందని నాలుగు రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినాసరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. యుద్ద ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస, ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయిందని అన్నారు. తాము హయాంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని జగన్ తన సుదీర్ఘ పోస్ట్ లో తెలిపారు.
చంద్రబాబు ప్రస్తుతం రైతులను పట్టించుకోవడం లేదు. ప్రతి రైతుకు రూ.20వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదు ? సూపర్ సిక్స్ హామీనే గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం ఇక రైతుల ఇతర సమస్యలను ఎందుకు పట్టించు కుంటుందని ఆక్షేపించారు.
ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్
By admin1 Min Read