పౌరులకు సదుపాయాలు కల్పించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు, నేరాల అదుపునకు, పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవడానికి డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ తాము రూపొందించిన మల్టీ పర్పస్ డ్రోన్లను సీఎం ఎదుట ప్రదర్శించారు. డ్రోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కూడా ఈ సందర్భంగా సీఎం సూచించారు. రవాణా సదుపాయాలు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు మందులు సరఫరా చేసేందుకు డ్రోన్లను వినియోగించాలని కూడా సీఎం స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబం నుండి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త:ప్రతి కుటుంబం నుండి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఉద్భవించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సెర్ప్, మెప్మా అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలను ఎంఎస్‌ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధంగా వినియోగించే వీలుకలుగుతుందని ఆయన తెలిపారు.