రష్యా-ఉక్రెయిన్ మధ్య గత 3 ఏళ్లుగా తీవ్ర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఉక్రెయిన్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని రష్యా ప్రయత్నిస్తుండగా…రష్యా ఆగడాలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో,నాటోలో చేరాలనే తలంపుతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది.ఉక్రెయిన్ నాటో దేశాల సహకారంతో రష్యాతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది.ఈ క్రమంలోనే రష్యా కూడా తన మిత్రదేశం ఉత్తర కొరియా సహకారం తీసుకుంటోంది.ఉత్తర కొరియాకు చెందిన సైన్యం ఈ యుద్ధంలో ప్రత్యక్ష పాల్గొని రష్యాకు సహకారం అందిస్తుంది.
ఇప్పటికే ఆ దేశానికి చెందిన వేలాది మంది సైన్యం ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం చేస్తున్నారు.ఉత్తర కొరియా సైన్యంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.రష్యా తరపున ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న ఉత్తర కొరియా సైనికులు వేలాది మంది ఇప్పటికే ఈ యుద్ధంలో భారీగా గాయపడటమో లేదా చనిపోవడమో జరిగిందని తెలిపారు.
కాగా మూడు వేల మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండవచ్చని జెలెన్‌స్కీ వెల్లడించారు.భారీగా సైనికులు నష్టపోతున్నా రష్యా, ఉత్తర కొరియాలు వెనకడుగు వేయడం లేదని,రెండు దేశాల మధ్య అడ్వాన్డ్స్ లెవెల్‌లో యుద్ధ విన్యాసాలు,సాంకేతికత బదిలీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.మాస్కో,ప్యాంగ్యాంగ్ మధ్య స్నేహం ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఇప్పటికైనా స్పందించాలని జెలెన్‌స్కీ హెచ్చరించారు.మాస్కోతో ఉన్న అనుబంధం మేరకు కిమ్ మరిన్ని బలగాలను పంపిస్తున్నారని,ఆయుధాలను కూడా ఈ యుద్ధానికి వినియోగిస్తున్నారని ఆయన తెలియజేశారు.