ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయని వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందంటూ ఆ రాష్ట్రానికి చెందిన కొందరు మహిళలు శనివారం కేజ్రీవాల్ నివాసం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నిరసనలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెండు పార్టీలూ కావాలనే తమపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ‘నా నివాసం వద్ద ఆందోళన చేసిన మహిళలు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు కాదు. ఆ రెండు పార్టీలకూ (బీజేపీ, కాంగ్రెస్) చెందిన వారే. పంజాబ్ ప్రజల మద్దతు మాకే ఉంది. మాపై వారికి పూర్తి విశ్వాసం ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌పై కలిసి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్-బీజేపీ అధికారికంగా ప్రకటించాలి’ అని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.
నాగచైతన్య – సాయిపల్లవి ‘తండేల్’.. ‘శివ శక్తి’ పాట రిలీజ్
నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. సాయిపల్లవి (Sai Pallavi) కథానాయిక. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్ సమర్పకులు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన ‘బుజ్జితల్లి’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ‘శివ శక్తి’ పాట విడుదలైంది. శ్రీకాకుళం సాంస్కృతిక వారసత్వాన్ని, పురాతన శ్రీ ముఖలింగం శివాలయాన్ని ప్రతిబింబించే పాటగా దీనిని తీర్చిదిద్దారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.