ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు ఉనికి మనకు గర్వకారణమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.అయితే అందరూ సంఘటితంగా ఉంటూ తెలుగు భాష ముందు తరాలకు కూడా పదిలంగా చేర్చాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన హాజరయ్యారు. తెలుగు భాషా ప్రేమికులందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాషలో ఎంతో విజ్ఞానం దాగి ఉంది. మన భాషను మనం పరిరక్షించుకోకపోతే చాలా విజ్ఞాన సంపదను కోల్పోతామని వివరించారు. తెలుగులో పదాలున్నప్పుడు వాటినే ఉపయోగించడం విధిగా పెట్టుకోవాలని ఆంగ్లభాషా వ్యామోహంతో మనం అమ్మభాషలోని చాలా పదాలను పలకడం లేదని అన్నారు. వాటి బదులు ఇంగ్లిష్ పదాలు విరివిగా వాడేస్తున్నాం. ఇలా అయితే చాలా పదాలు కనుమరుగవుతాయని వాటితో పాటే తరతరాలుగా మన పెద్దలు సాధించి పెట్టిన విజ్ఞానం కూడా కనుమరుగవుతుందని వివరించారు.
ప్రభుత్వాలు తెలుగు భాషా ఉత్సవాలు, తెలుగువారి సాంస్కృతిక వైభవ చిహ్నమైన కూచిపూడి నృత్యోత్సవాలు, త్యాగయ్య, క్షేత్రయ, రామదాసు వంటి వాగ్గేయకారులను, వేమన వంటి తత్వవేత్తలను గౌరవించుకునే విధంగా ఆరాధనోత్సవాలు నిర్వహించాలని ఈసందర్భంగా పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు తెలుగు భాష, సంస్కృతికి సంబంధించి పోటీలు నిర్వహిస్తే నేటి తరంలో క్రమంగా తెలుగుభాష ప్రాధాన్యం తెలుస్తుందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు ఉనికి మనకు గర్వకారణం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
By admin1 Min Read