ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఉన్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాల పనిగా ఆప్ ఆరోపించింది. దాడికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో ఆప్ పోస్ట్ చేసింది. ‘ఓటమి భయంతో బీజేపీ ఆందోళన చెందుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి తన గూండాలను ఉపయోగించింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నప్పుడు బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. ఆయనను గాయపరిచేందుకు ప్రయత్నించారు. కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా చేయాలనుకున్నారు. బీజేపీ వ్యక్తుల పిరికి దాడికి కేజ్రీవాల్ భయపడరు. ఢిల్లీ ప్రజలు మీకు తగిన సమాధానం ఇస్తారు’ అని ఎక్స్‌లో పేర్కొంది. ఆప్ ఆరోపణలను పర్వేష్ ఖండించారు. కేజ్రీవాల్ కారు ఇద్దరు యువకులను ఢీకొట్టిందని విమర్శించారు.
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు ఆయన వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఉన్న కారుపై రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు కేజ్రీవాల్ కారును అక్కడి నుంచి పంపించి వేశారు.