ఇండోనేసియా ప్రజలను మౌంట్ ఇబు అగ్నిపర్వతం వణికిస్తోంది.ఒక్క జనవరి నెలలోనే వెయ్యి సార్లు విస్ఫోటం చెందిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.నార్త్ మలుకు ప్రావిన్స్‌లోని హల్మహేరా ద్వీపంలోని మౌంట్ ఇబు జనవరి నుంచి విస్ఫోటం చెందుతూనే ఉంది.ఇప్పటివరకు దానినుంచి గాలిలోకి 0.3 కి.మీ. నుండి 4 కి.మీ. వరకు బూడిద ఎగసిపడింది.తాజాగా ఆదివారం 1.5 కి.మీ. మేర పైవరకు బూడిద కనిపించింది.మౌంట్ ఇబు అబ్జర్వేషన్ పోస్ట్ వరకు శబ్దం వినిపించిందని ఇండోనేసియా జియోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక ఒక్క ఆదివారమే 17సార్లు అగ్నిపర్వతం బద్ధలైందని తెలిపింది.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ఆరు గ్రామాల్లోని మూడు వేల మంది గ్రామస్థులు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే పలువురు గ్రామస్థులు అధికారుల హెచ్చరికలను పాటించేందుకు నిరాకరిస్తున్నారు.తమ పంటలను మధ్యలో వదిలి వచ్చేయడానికి వారు సిద్ధంగా లేరు.అయితే అధికారులు మాత్రం వారికి నచ్చజెబుతున్నారు.ఇండోనేసియాలోని క్రియాశీలక అగ్ని పర్వతాల్లో మౌంట్ ఇబు కూడా ఒకటి.అది గత జూన్ నుంచి మరింత క్రియాశీలకంగా మారింది.