లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. కేఎల్ రాహుల్‌ను వదులుకున్న లఖ్‌నవూ.. మెగా వేలంలో రిషభ్ పంత్ కు భారీ ధర వెచ్చించి దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర రూ.27 కోట్లతో పంత్ సొంతం చేసుకున్న లఖ్‌నవూ.. అతడికే సారథ్య బాధ్యతలు కూడా అప్పగించింది. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా ఈ విషయాన్ని వెల్లడించారు. అనంతరం గొయెంకా మాట్లాడారు.పంత్ వచ్చే 14-15 ఏళ్లు ఎల్‌ఎస్‌జీ తరఫున ఆడతాడని,ఈ కాలంలో కనీసం ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు.
రిషభ్ పంత్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా మాత్రమే కాక టోర్నీలో అత్యుత్తమ ఆటగాడు అవుతాడని నమ్ముతున్నా. ఆటపై ప్రేమ, గెలవాలనే తపన ఉన్న ఇలాంటి ఆటగాళ్లను నేను చూడలేదు.ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను విజయవంతమైన జట్లుగా చెబుతారు. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ అద్భుతంగా ఆ టీమ్‌లను ముందుండి నడిపించారు.నా మాటలు గుర్తుంచుకోండి. 10 ఏళ్ల తర్వాత ప్రజలు ధోనీ, రోహిత్‌తోపాటు పంత్ పేరును చెబుతారు. భారీ ధర దక్కించుకోవడంతో పంత్‌పై అదనపు ఒత్తిడి ఉండదు.వేలం పూర్తవడంతోనే దాని గురించి చర్చ ముగిసింది.ప్రతి జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసింది ఒకే ఆటగాడి కోసం ఎంత ఖర్చు చేశారనేది,మిగిలిన ఆటగాళ్ల కోసం ఎంత వెచ్చించారన్నది ముఖ్యం కాదు’ అని సంజీవ్ గొయెంకా పేర్కొన్నారు.