ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు అయిన జొమాటో ,స్విగ్గీ షేర్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి.ఫలితాల నేపథ్యంలో జొమాటో షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోగా…దాని ప్రభావం అటు స్విగ్గీపైనా పడింది.దీంతో రెండు కంపెనీల షేర్లు నేడు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి గానూ జొమాటో ఏకీకృత నికర లాభం రూ.59 కోట్లుగా పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 57.2 శాతం క్షీణత నమోదు చేసింది.
తన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ ఆర్డర్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు, దూకుడుగా స్టోర్ల విస్తరణ చేపట్టడంతో లాభం తగ్గిందని జొమాటో వివరణ ఇచ్చింది.స్టోర్ విస్తరణ కోసం పెట్టుబడుల్ని వేగవతం చేయడం వల్ల సమీప కాలంలో నష్టాలు నమోదుకావచ్చని తెలిపింది.ఫలితాల అనంతరం బ్రోకరేజీ సంస్థలు అంచనాలను తగ్గించాయి.దీంతో కంపెనీ షేర్లు 11 శాతం మేర కుంగాయి.క్విక్ కామర్స్ విభాగంలో పోటీ పెరుగుతున్న వేళ.. బలహీన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం కూడా షేర్లలో అమ్మకాల ఒత్తిడికి కారణమైంది.