మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది.మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఛత్తీస్‌గఢ్ ,ఒడిశా రాష్ట్రాల్లోని అడవులను భద్రతాబలగాలు జల్లెడపడుతున్నాయి.ఈ క్రమంలోనే ఈ నెల 20న రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేత చలపతి తన టీమ్‌తో సహా దొరికిపోయాడు.మొత్తం 14 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి.అయితే మావోయిస్టుల కోసం అడవులను జల్లెడ పడుతున్న భద్రతాబలగాలకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల పలు ప్రాంతాల్లో 8 మందుపాతరలు లభ్యమయ్యాయి.
వాటిని బుధవారం నిర్వీర్యం చేశారు.అందుకు సంబంధించిన వీడియోలను బీజాపూర్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. కింది వీడియోలో మీరు కూడా ఆ దృశ్యాలను చూడవచ్చు.భద్రతాబలగాలపై దాడి కోసం మావోయిస్టులు అడవుల్లో పలు ప్రాంతాల్లో మందుపాతరలను పాతిపెడుతున్నారు.
బీజాపూర్ పోలీసులు ఇవాళ నిర్వీర్యం చేసిన మందుపాతరలు ఒక్కొక్కటి 5 కిలోల చొప్పున ఉన్నట్లు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం భద్రతాబలగాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఏడుగురు జవాన్లు ఒక డ్రైవర్ మరణించిన సంగతి తెలిసిందే.

