యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్ , ఓలా సంస్థలపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువ కావడంతో కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ స్పందించింది. ఆ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ యాప్‌లు ఫోన్ ధరను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ అనే తేడా మాత్రమే కాకుండా.. ఫోన్ రేటును బట్టి కూడా ధరల్లో తేడా ఉంటోందని పలువురు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఉబర్, ఓలా సంస్థలను వినియోగదారుల మంత్రిత్వశాఖ ఆదేశించింది.
మరోవైపు ఒకే సర్వీసుకు ఈ రెండు సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపైనా కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) చర్యలకు ఉపక్రమించింది. ఒకే సర్వీసుకు రెండు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ధరల్లో వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని సీసీపీఏ పేర్కొంది. ఛార్జీల విషయంలో నిజాయితీ, పారదర్శకత తీసుకొచ్చేందుకు సరైన వివరణతో రావాలని పేర్కొంది.