ఫామ్ కోల్పోయి దేశవాళీ బాట పట్టిన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సుదీర్ఘ విరామం తర్వాత రంజీ బరిలో దిగబోతున్నాడు. ఈనెల 30న రైల్వేస్‌తో ఆరంభమయ్యే మ్యాచ్‌లో అతడు ఢిల్లీ తరఫున ఆడబోతున్నాడు. ఢిల్లీ క్రికెట్ సంఘం సోమవారం అధికారికంగా విడుదల చేసిన జట్టులో కోహ్లి కూడా ఉన్నాడు. ఈ జట్టుకు ఆయుష్ బదోని సారథి. మంగళవారం అతడు ఢిల్లీ బృందంతో కలిసి సాధన చేయబోతున్నాడు. ఇప్పటికే విరాట్ టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో ముంబయిలోని అలీబాగ్‌లో ప్రాక్టీస్ చేశాడు. స్క్వేర్ ఆఫ్ ద వికెట్ షాట్లను కొట్టడం, బ్యాక్‌ఫుట్‌పై ఆడడంపై దృష్టి పెట్టాడు. 2012లో ఉత్తర్‌ప్రదేశ్‌పై అతడు చివరిగా రంజీ ఆడాడు.
‘‘విరాట్ కోహ్లితో కలిసి ఆడబోతుండడం, డ్రెస్సింగ్‌రూమ్ పంచుకోబోతుండడం ఢిల్లీ యువ ఆటగాళ్లకు మంచి అనుభవం. మా టీమ్‌లో కోహ్లి కాకుండా నవ్‌దీప్ సైని మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మిగతావాళ్లెవరూ జాతీయ జట్టుకు ఆడలేదు. వారు విరాట్ నుంచి నేర్చుకోబోతున్నారు. కోహ్లి ఉండడంతో భద్రతను కూడా పెంచాం’’ అని ఢిల్లీ క్రికెట్ సంఘం కార్యదర్శి అశోక్ శర్మ చెప్పాడు.
మరోవైపు హరియాణాతో తలపడే కర్ణాటక జట్టులో టీమ్‌ఇండియా స్టార్ కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఈ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అయిన మోచేతి గాయం నుంచి రాహుల్ కోలుకున్నాడు. 2020లో బెంగాల్‌పై ఆడిన తర్వాత రంజీల్లో బరిలో దిగడం రాహుల్‌కు ఇదే తొలిసారి. మంగళవారం అతడు జట్టుతో కలిసి సాధన చేసే అవకాశాలున్నాయి. గత వారం రంజీ మ్యాచ్ ఆడిన టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ తమ జట్ల తరఫున తర్వాతి మ్యాచ్ ఆడటం లేదు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముందు నిర్వహించే శిబిరానికి వీరు హాజరుకానున్నారు.