మహా కుంభమేళాను పురస్కరించుకొని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమానాల ఛార్జీలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర విమానయాన శాఖ సోమవారం వెల్లడించింది. పెరుగుతున్న భక్తుల రద్దీకి తగ్గట్టుగా విమానాల సంఖ్యను పెంచినట్టు ఆ శాఖ వివరించింది. వచ్చే నెల 26 వరకూ కొనసాగనున్న మహాకుంభ్ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమానాల ఛార్జీలు పెంచేస్తున్నారంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కు చెందిన అధికారులు వివిధ ఎయిర్‌లైన్‌ల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. విమానాల సంఖ్యను పెంచాలని, ఛార్జీలను నియంత్రించాలని కోరారు. ప్రస్తుతం దేశంలోని 17 నగరాల నుంచి నేరుగా 132 విమానాలు ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణికుల్ని తీసుకెళ్తున్నాయి.
ప్రతినెలా సుమారు 80 వేల మంది ప్రయాణికులు విమాన సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. తాజాగా ఆ పుణ్యక్షేత్రాన్ని విమాన మార్గంతో కలిపే నగరాల సంఖ్యను 26కు పెంచారు.శ్రీనగర్ నుండి విశాఖపట్నం వరకూ దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు విమానాలు నడుస్తున్నాయని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.మహాకుంభమేళాలో భాగంగా జనవరి 29న, ఫిబ్రవరి 3న అమృత స్నానం కార్యక్రమం జరుగుతుందని, ఫిబ్రవరి 4న, ఫిబ్రవరి 12న, 26న ముఖ్యమైన స్నాన ఘట్టం జరుగుతుందని ఈ దినాల సందర్భంగా పెరిగే భక్తుల రద్దీకి తగ్గట్టుగా విమానాల సామర్థ్యాన్ని పెంచాలంటూ పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్‌మోహన్ నాయుడు నిర్దేశించారని, ఆయా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు ప్రయాణించే ప్రయాగ్‌రాజ్ విమానాల ఛార్జీలు నియంత్రణలో ఉండాలని మంత్రి ఆదేశించారని అధికారిక ప్రకటన వివరించింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం విమాన ఛార్జీలు ప్రభుత్వ నియంత్రణలో లేవు.