మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళా లో విపరీతమైన రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి ప్రయాగ్‌రాజ్ కు వెళ్లడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక రైళ్లను నిలిపివేసినట్లు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ మనీష్ కుమార్ తెలిపారు. అధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సాధారణ రైళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయని అన్నారు.
పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం ఘాట్‌కు భక్తులు వస్తున్న వాహనాలు, బస్సులను ప్రయాగ్‌రాజ్ సరిహద్దుల్లో 24 గంటల పాటు నిలిపివేశామన్నారు. కుంభమేళా ప్రాంతంలో ఇప్పటికే పది కోట్ల మంది ప్రజలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తుండడంతో 24 గంటల పాటు ఇతరులను అనుమతించట్లేదని జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ చంద్ర పేర్కొన్నారు. మరోవైపు.. ఇతర ప్రాంతాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్న రైలు సదుపాయాలను ఆపివేయలేదని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్ నుంచి భక్తులను తిరిగి తీసుకువెళ్లేందుకు అదనంగా దాదాపు 360 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశామన్నారు. రైల్వేస్టేషన్లో రద్దీని ఎప్పటికప్పుడు నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.