2018లో నాటి టిడిపి హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు వైసిపి పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదికలో స్పష్టంగా వెల్లడించిందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని లోకేష్ విమర్శించారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యిందని పేర్కొన్నారు. అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు.. తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం.. ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయని ఆక్షేపించారు. విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించి ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నట్లు వివరించారు.
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడింది. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైంది. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం… pic.twitter.com/VPGUkowB40
— Lokesh Nara (@naralokesh) January 29, 2025