టాటా సంస్థల అధినేత రతన్ టాటా గత ఏడాది అక్టోబర్ లో మరణించిన విషయం తెలిసిందే.అయితే రతన్ టాటా కేవలం లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా మాత్రమే కాకుండా, గొప్ప మానవతావాదిగా, సమాజ సేవకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.రతన్ టాటా మరణానంతరం రూ.వేల కోట్ల ఆస్తిని తాను నెలకొల్పిన ఫౌండేషన్లకు,సోదరుడు జిమ్మీ టాటాతో పాటు తన సహాయకులు,పెంపుడు శునకానికి చెందేలా వీలునామా రాసి తన మంచి మనసు చుట్టుకున్నారు.అయితే వీలునామాలో ఓ రహస్య వ్యక్తికి రూ.వందల కోట్లు ఇవ్వాలంటూ…రతన్ టాటా పేర్కొన్నారని సమాచారం.తాజాగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
కాగా ఆ వీలునామాలో ఉన్న రహస్య వ్యక్తి పేరు చూసి టాటా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.ఆ రహస్య వ్యక్తి ఎవరో కాదు దాదాపు 6 దశాబ్దాలుగా రతన్ టాటాకు నమ్మకస్తుడిగా సేవలు అందించిన జంషెడ్పుర్ కు చెందిన ట్రావెల్స్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తా అని సమాచారం.తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్లో భాగమైన తాజ్ సర్వీసెస్తో 2013 నుండి మోహన్ దత్తాకు చెందిన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీ కలిసి పనిచేస్తోంది.అయితే టాటా కుటుంబానికి మోహన్ దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారని టాటా గ్రూప్కు చెందిన అధికారులు తెలిపారు.ఈ మేరకు మోహన్ దత్తాకు తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని రతన్ టాటా వీలునామాలో పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.