ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మాత్రం మారడం లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో అప్పులు, రోజుకో బలవన్మరణం. రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం. ఇది మన రాష్ట్రంలో రైతుల దీనస్థితి అని షర్మిల సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులను పట్టించుకొనే దిక్కు లేదని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలో వైయస్ సీఎంగా ఉన్నప్పుడు అన్నపూర్ణగా పేరొంది పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపిన రైతులు.. నేడు గిట్టుబాటు లేక అల్లాడుతున్నారని పేర్కొన్నారు. ధర లేక దిగాలు పడుతున్న రైతాంగానికి గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు మాయ మాటలు చెప్తూనే ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబు గారు మొదటి 5 ఏళ్లు ఏడాదికి రూ.5 వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మాట తప్పితే.. జగన్ గారు ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారని మండిపడ్డారు. ఇద్దరు కలిసి రాష్ట్ర రైతులను నిండా ముంచారని ధరల స్థిరీకరణ పేరుతో రాజకీయాలు చేశారు తప్పిస్తే రూపాయి ఇచ్చింది లేదని అన్నారు. రాష్ట్రంలో 55 లక్షల మంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ధరల స్థిరీకరణ నిధిని తక్షణం ఏర్పాటు చేయాలన్నారు. ఏడాదికి రూ.5 వేల కోట్లు ధరల స్థిరీకరణ కోసం కేటాయించాలని గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పిన రూ.20 వేల సహాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
Previous Articleవిజయవాడలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలో అవగాహన నదస్సు: పాల్గొన్న ఏపీ హోం మంత్రి అనిత
Next Article పంజాబ్ సీఎం చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ…!