అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలుగా ఉన్న వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చే మార్గం సుగమమైంది.నాసా-స్పేస్ ఎక్స్‌లు సంయుక్తంగా చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.శనివారం ఉదయం అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించిన ఈ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నలుగురు వ్యోమగాములను పంపించనుంది.గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా సునీతా విలియమ్స్,విల్మోర్ ఐఎస్ఎస్కు వెళ్లారు.
అయితే ఆ నౌకలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో భూమికి తిరిగి రావడం సాధ్యపడలేదు.నాసా ఆగస్టులోనే వారిని భూమికి తీసుకురావాలని నిర్ణయించినా,తగిన ఏర్పాట్లు ఆలస్యం కావడంతో వారు అక్కడే ఉండిపోయారు.తాజాగా ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో,సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చే అవకాశం ఏర్పడింది.ఈ మిషన్ ద్వారా నాసా తన అంతరిక్ష ప్రయోగాల్లో మరింత స్థిరత్వాన్ని సాధించనుంది.వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకునే వరకు మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.