భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్లు దాదాపు 9 నెలల తర్వాత భూమిపైకి చేరుకున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వలన అంతరిక్షంలోనే ఉండిపోయిన వీరిద్దరూ మరో ఇద్దరు ఆస్ట్రోనాట్లతో కలిసి సురక్షితంగా భూమిని చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్) నుండి బయల్దేరిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక నేటి తెల్లవారుజామున 3: 27 గంటలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. గంటకు 17 వేల మైళ్ల వేగంతో భూమివైపు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంటూ గంటకు వేగం 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకొని చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం వారిని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించనున్నారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు చేయనున్నారు. వారు తిరిగి భూమి మీద పరిస్థితులకు అలవాటు పడే విధంగా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు.
గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్పేస్ షిప్ ‘స్టార్ లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్ కు వెళ్లారు. ప్లాన్ ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉండగా… స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రోనాట్ లు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. ఇక అప్పటి నుండి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు. తొమ్మిది నెలల్లో అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్లో ఐఎస్ఎస్ నుండి తిరిగి పయనమయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15 గంటలకు అన్లాకింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున ఇంజిన్లను మండించి క్రూ డ్రాగన్ను భూవాతావరణంలోకి పునఃప్రవేశపెట్టారు.



