పంబన్ కొత్త రైల్వే వంతెన ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఏప్రిల్ 6న రామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించి, ఈ వంతెనను జాతికి అంకితం చేయనున్నారు. 2.5 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం దీప్వంతో కలుపుతుంది. 1914లో బ్రిటీష్ కాలంలో నిర్మించిన పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో 2022లో మూసివేశారు. దాని స్థానంలో రూ.535 కోట్ల వ్యయంతో రైలు వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సరికొత్త వంతెనను నిర్మించారు.
ఆసియాలో తొలిసారిగా వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిగా దీనిని రూపొందించడం విశేషం.పాత వంతెనపై రైలు ప్రయాణానికి 25-30 నిమిషాలు పట్టగా, కొత్త వంతెనపై కేవలం ఐదు నిమిషాల్లోనే దూసుకెళ్లొచ్చు. రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ వంతెనపై 75 కిలోమీటర్ల వేగంతో రైలు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. తుప్పు సమస్య రాకుండా మూడు పొరల పాలీసిలోక్సేన్ పెయింట్ వేశారు, దీంతో వంతెన దాదాపు 58 సంవత్సరాల వరకు రక్షణ పొందుతుంది. సముద్రంలో వేసిన దిమ్మెలకు ఇబ్బంది కలగకుండా ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు. స్కాడా సెన్సర్లతో లింక్ చేయడం వల్ల గాలుల వేగం అధికమైనా వంతెనను ఆటోమేటిక్‌గా మూసివేయొచ్చు. రిమోట్ కంట్రోల్ ద్వారా వంతెన లిఫ్ట్‌ను ఆపరేట్ చేసే విధంగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.

