రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతేడాది మాస్కో పర్యటన సందర్భంగా ఇచ్చిన ఆహ్వానాన్ని స్వీకరించి, పుతిన్ భారత పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని రష్యా రాయబార కార్యాలయం గురువారం అధికారికంగా ప్రకటించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ మాట్లాడుతూ, పుతిన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, అయితే ఖచ్చితమైన తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత పుతిన్ భారత్ పర్యటించడం ఇదే తొలిసారి కానుండటంతో, ఈ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.
భారత్, రష్యా మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, ప్రతి ఏడాది ఒకరు మరొకరి దేశాన్ని సందర్శించాలని అగ్రనేతలు అంగీకరించారు. ఈ నేపథ్యంలో గతేడాది ప్రధాని మోదీ మాస్కో పర్యటనలో పుతిన్‌ను భారత పర్యటనకు ఆహ్వానించారు. దాన్ని అంగీకరించిన పుతిన్ త్వరలో భారత్‌కు రానున్నారు. ఈ పర్యటన ద్వారా రష్యా-భారత్ సంబంధాలు మరింత బలపడే అవకాశముంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే కాకుండా అంతర్జాతీయ రాజకీయ పరంగా కూడా కీలకంగా మారనుంది.

