దేశంలో ప్రముఖ ట్యాక్సీ సేవలైన ఓలా, ఊబర్, ర్యాపిడోలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం ‘సహకార్ ట్యాక్సీ’ పేరుతో కొత్త రవాణా సేవలను ప్రారంభించనుంది. కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రకటించారు. బైక్, క్యాబ్, ఆటో సేవలను అందించే ఈ ట్యాక్సీ వ్యవస్థ ద్వారా డ్రైవర్లు నేరుగా ఆదాయం పొందేలా ప్రభుత్వ మద్దతుతో ప్రత్యేక సేవలను అమలు చేయనుంది.ప్రైవేటు సంస్థలకు లాభాలను పంచాల్సిన అవసరం లేకుండా, వాహనదారులు తమ సేవల ద్వారా పూర్తిగా స్వయం సమృద్ధిని సాధించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.‘సహకార్ సే సమృద్ధి’ నినాదాన్ని సాకారం చేసేందుకు గత మూడున్నరేళ్లుగా కేంద్ర సహకార శాఖ కృషి చేస్తోందని అమిత్ షా వెల్లడించారు. రాబోయే నెలల్లో ఈ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ మద్దతుతో నడిచే ఈ ట్యాక్సీ సేవల ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా డ్రైవర్లకే చెందుతుందని, పారిశ్రామికవేత్తలకు లాభాలు వెళ్లకుండా, వాహనదారుల జీవితాలలో మార్పును తీసుకువచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. అదనంగా, దేశవ్యాప్తంగా డ్రైవర్లకు బీమా సేవలను అందించేందుకు ప్రత్యేకంగా సహకార బీమా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో ‘యాత్రి సాథీ’ ట్యాక్సీ సేవలు విజయవంతంగా నడుస్తుండగా, 2022లో కేరళ ప్రభుత్వం ‘కేరళ సవారి’ సేవలను ప్రారంభించినప్పటికీ తక్కువ వినియోగంతో మూతపడింది.అయితే కొత్త మార్పులతో తిరిగి ప్రారంభించేందుకు కేరళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సహకార్ ట్యాక్సీ వ్యవస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు, డ్రైవర్లకు ఆర్థికంగా నిలువుగా మారనుంది.