అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ బాజిందర్ సింగ్ (Bajinder Singh)కు పంజాబ్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.అతనికి జీవిత ఖైదు విధిస్తూ ఇవాళ న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.‘యేసు యేసు ప్రాఫెట్’ గా ప్రాచుర్యం పొందిన బాజిందర్ సింగ్‌పై 2018లో పంజాబ్‌లోని జిరాక్‌పూర్‌కు చెందిన ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది.విదేశాలకు తీసుకెళ్తానని మోసగించి తనను శారీరకంగా వాడుకున్నాడని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో మొత్తం ఏడుగురిపై అభియోగాలు నమోదు కాగా, ట్రయల్ కోర్టు బాజిందర్ సింగ్‌ను దోషిగా తేల్చింది. మిగతా ఆరుగురిని నిర్దోషులుగాప్రకటించింది.
ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న బాజిందర్ సింగ్ గతంలో తన కార్యాలయంలో ఓ మహిళపై, మరో వ్యక్తిపై దాడికి పాల్పడిన వీడియోలు వైరల్ అయ్యాయి.2022లో ఓ 22 ఏళ్ల యువతి తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.అంతేగాక,ఓ అనారోగ్యంతో ఉన్న మహిళను నయం చేస్తానని చెప్పి,ఆమె కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. కోర్టు తీర్పుతో బాజిందర్ సింగ్ మోసం, నేర చరిత్రపై తెరతీసినట్లయింది.