కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా కొత్త పన్నులను విధిస్తూ ప్రజలను ఆర్థికంగా ఒత్తిడికి గురిచేస్తోంది.ఇటీవల ఆర్టీసీ, మెట్రో, వాహన రిజిస్ట్రేషన్, విద్యుత్ చార్జీలు, నీటి బిల్లులు, స్టాంప్ డ్యూటీ,ఎక్సైజ్ డ్యూటీ వంటి అనేక సేవలకు సంబంధించి ట్యాక్స్‌లు పెంచిన ప్రభుత్వం,ఇప్పుడు చెత్త సేకరణపైనా యూజర్ ఛార్జీలను విధించింది.బెంగళూరు మహానగర పాలక సంస్థ ఏప్రిల్ 1 నుంచి వ్యర్థాల నిర్వహణ ఛార్జీలను వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.భవనాల విస్తీర్ణాన్ని బట్టి పన్ను విధిస్తూ, 600 చ.అడుగులలోపు గల నివాస భవనాలకు నెలకు రూ.10, 4,000 చ.అడుగులపైగా ఉన్న ఇళ్లకు నెలకు రూ.400 వసూలు చేయనుంది.వాణిజ్య భవనాలకు కేజీకి రూ.12 చొప్పున చెత్త సేకరణ ఛార్జీలు విధించనున్నారు.
అంతేకాక,ప్రభుత్వం తాజాగా డీజిల్‌పై లీటర్‌కు రూ.2 పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో డీజిల్ లీటర్ ధర రూ.91.02కు చేరుకుంది.ఈ పెంపుతో రైతులు,రవాణా రంగం,డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు మండిపడుతున్నారు.ఇంధన ధరలు పెరిగితే సరుకుల రవాణా ఖర్చు పెరిగి,అన్ని రకాల వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఇప్పటికే పాలు,పెరుగు ధరలు పెంచిన ప్రభుత్వం, వరుసగా తీసుకుంటున్న పన్నుల నిర్ణయాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ప్రభుత్వ తీరుపై ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.