దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి.దక్షిణ భారతదేశంలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండగా, ఉత్తర భారతంలో వేసవి వేడిమి మిన్నంటుతోంది.వాయవ్య భారతదేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండగా,మధ్య మహారాష్ట్ర,దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక,తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఛత్తీస్‌గఢ్,కేరళ,మాహే,ఒడిశాలోనూ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
ఇక ఉత్తర భారతదేశంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.ఢిల్లీ ఎన్సీఆర్ సహా పలు ప్రాంతాల్లో వాతావరణ మార్పుల కారణంగా రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది.వాయువ్య భారతదేశంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు వచ్చే ఆరు రోజుల్లో మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. నెల 7 వరకు రాజస్థాన్‌లో వడగాలులు వీస్తాయని, గుజరాత్లో వేడి వాతావరణం ఉంటుందని చెప్పింది. ఏప్రిల్ 1న, సౌరాష్ట్ర, కచ్‌లోని సురేంద్రనగర్‌లో గరిష్ఠంగా 42.3 డిగ్రీలుగా నమోదైంది.అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. భారత్-మయన్మార్ జాతీయ రహదారి 113 తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.