ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా రూ.1,005 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా చేపట్టే రహదారి పనులకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అరకు, మన్యం ప్రాంతంలో డోలీ మోతలు ఉండకూడదని ఏ గర్భిణీ స్త్రీ వైద్యం సకాలంలో అందక ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆకాంక్షకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా PVTG, PMGSY పథకాల ద్వారా గిరిజన ప్రాంతాలకు, సీఎం చంద్రబాబు నేతృత్వంలో గిరిజన అభివృద్ధికి నిధులు అడగగానే కేటాయించడంతో అడవి తల్లి బాట కార్యక్రమం శ్రీకారం చుట్టామన్నారు.
గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో 90 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం ఇక్కడ ఓట్లు రాకపోయినా సరే మీ బాగోగులు పట్టించుకునే ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం 10 నెలల్లో రూ.1,005 కోట్లు కేటాయించి 1,062 కి.మీ రోడ్ల నిర్మాణం మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వానికి తన, మన భేదం లేదు అందుకే మాకు ఓట్లు పడని అరకు, పాడేరు ప్రాంతాల్లో దాదాపు ₹1,005 కోట్లతో రోడ్ల నిర్మాణం మొదలు పెట్టీ చిత్తశుద్ధి చాటుకున్నాం. పెదపాడు గ్రామంలో ప్రజలు 12 రకాల అభివృద్ధి కార్యక్రమాలు అడిగారు, వాటిని వెంటనే అనుమతి మంజూరు చేశామన్నారు. యువత గంజాయి సాగు వదిలి, టూరిజం వైపు అడుగులుంవేయాలి, గంజాయి జీవితాలు నాశనం చేస్తుంది, కాబట్టి గంజాయి సాగు వదిలేయండి అని విజ్ఞప్తి చేశారు.2018 లో ఇక్కడ తిరిగాను, ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నాను, ఆరోజు నేను వారి కష్టాలు తీర్చలేకపోయాను అనే బాధ, ఈరోజు అధికారం ఇచ్చి 1,069 కిమీ రోడ్డు వేసే శక్తినిచ్చింది. దయచేసి నాయకులు అందరూ ప్రజలతో మమేకం అవ్వాలని కోరారు. వేసవి కాలంలో దయచేసి బహిరంగ ప్రదేశాల్లో, అటవీ ప్రాంతాల్లో నిప్పు రగల్చకుండా చూడాలని, పచ్చని పర్యావరణం దెబ్బతింటే మీ ఆర్ధిక భద్రత తో పాటుగా, మూగ జీవాల ప్రాణాలు పోతాయి దయచేసి ఆలోచించాలని కోరారు. వచ్చే సంవత్సరం స్థానిక ఎన్నికల్లో కూటమి జెండాలు రెవరెపలాడాలి, మీరు 5 ఏళ్లు అవకాశాన్ని వైసీపీ వినియోగించుకోలేదు, మేము మీరు ఓటు వేయకపోయిన మీకోసం పనిచేస్తున్నాం, మాది గిరిజనుల కోసం నిలబడే ప్రభుత్వమని పవన్ స్పష్టం చేశారు.