మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మళ్లీ ఒకే వేదికను పంచుకున్నారు.ఇది గత రెండు వారాల్లో వారిద్దరూ కలసి కనిపించడం మూడోసారి కావడంతో,రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పూణెలోని సఖర్ సంకుల్లో సోమవారం జరిగిన సమావేశంలో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. వసంతదాదా షుగర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ,భూసార, ఎరువుల వినియోగం వంటి అంశాలపై ఏఐ ఉపయోగంపై చర్చ జరిగింది.
ఇదిలా ఉండగా, శరద్ పవార్–అజిత్ పవార్ మధ్య సంబంధాలు మరలా సానుకూలంగా మారుతున్నాయన్న ఊహాగానాలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మీడియా ప్రశ్నలపై స్పందించిన అజిత్ పవార్, “ఈ భేటీలకు రాజకీయ ప్రాధాన్యత లేదని, కుటుంబ కార్యక్రమాల సందర్భంగా మాత్రమే కలుసుకున్నాం” అని తెలిపారు. రాజకీయ వర్గాల్లోనే కాక సామాన్య ప్రజల్లోనూ ఈ భేటీలపై ఆసక్తి నెలకొనగా,నిజంగానే ఇక్కడ ఎలాంటి రాజకీయ సమీకరణాలు దాగున్నాయో అనే ప్రశ్న మాత్రం కొనసాగుతూనే ఉంది.