ప్రజా రాజధాని అమరావతికి మళ్లీ ఊపిరి పోద్దామనిరాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం బేతపూడి గ్రామంలో నర్వ్ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ నాయకులు ప్రణాళికబద్ధంగా అమరావతిని నాశనం చేశారని విమర్శించారు. 10వేల మంది కార్మికుల పొట్ట కొట్టారని మండిపడ్డారు. అమరావతి లేకపోతే మనకు అడ్రస్ లేదని పేర్కొన్నారు. జగన్ చేసిన వినాశనం గురించి తెలిసే ప్రధాని మోడీ రెండోసారి రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారని ప్రధాని పర్యటన విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాజధాని రైతులు, మహిళలు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు. చేయని తప్పులకు కేసుల్లో ఇరుక్కున్నారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అలుపెరుగని పోరాటం చేశారని పేర్కొన్నారు. ఇక రాజధాని అభివృద్ధి కోసం 33 వేల ఎకరాలు కాకుండా మరో 44 వేల ఎకరాలు సేకరిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి అనుమానాలు, అపోహలు ఉంటే మరిచిపోండి. కూటమి ప్రభుత్వం కొత్తగా భూ సమీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మా దృష్టంతా ప్రస్తుతం సేకరించిన 33 వేల ఎకరాల అభివృద్ధిపైనే ఉంది. సీఆర్డీఏ పరిధిలోనే రూ.30 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నాం. భవిష్యత్తులో అవసరాల కోసం భూమి సేకరించాలని కొంతమంది మాట్లాడినా సీఎం ఎటువంటి నిర్ణయం గానీ, ఆదేశాలుగానీ ఇవ్వలేదు. దాని గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు.
అమరావతికి మళ్లీ ఊపిరి పోద్దాం… ప్రధాని పర్యటన విజయవంతం చేద్దాం: మంత్రి నాదెండ్ల
By admin1 Min Read