ఇటీవల జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మరోసారి స్పందించింది. ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ కు పాకిస్థాన్ సహకరించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇక ఇరు దేశాలు కూడా సంయమనం పాటించాలని, విస్తృత ప్రాంతీయ ఘర్షణలకు ఆస్కారం ఇవ్వకూడదని సూచించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తమ భూభాగం నుండి పనిచేస్తున్న ఉగ్రవాదులను వేటాడి, కట్టడి చేసే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, ఈ అంశంపై భారత్కు సహకరిస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే అమెరికా అత్యున్నత స్థాయి నేతలు భారత్ కు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ కు సహకరించాలి: పాక్ కు సూచించిన అమెరికా
By admin1 Min Read