రేపు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు విశాఖపట్నం రానున్నారు. రేపు విశాఖలోని ఆర్కే బీచ్‌లో జరగనున్న యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సాయంత్రం ఒడిశాలోని భువనేశ్వర్ నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి, సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన నేరుగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలోని ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. అక్కడ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి ప్రధాని ఈస్టర్న్ నేవీ అతిథి గృహంలో బస చేయనున్నారు.రేపు ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఉదయం 6.25 గంటలకు రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్‌కు చేరుకుని ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకు యోగా చేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ భారీ యోగా ప్రదర్శనలో సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మోడీ ప్రసంగిస్తారు. తర్వాత ఉదయం 7.50 గంటలకు ప్రధాని ఆర్కే బీచ్ నుండి బయలుదేరి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కు వెళతారు. అక్కడ ఉదయం 8.15 నుండి 11.15 గంటల వరకు పలు కార్యక్రమాలను ప్రధాని కోసం రిజర్వ్ చేసి ఉంచారు. అనంతరం ఉదయం 11.25 గంటలకు ఐఎన్‌ఎస్ పరేడ్ గ్రౌండ్ నుండి హెలికాప్టర్‌లో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, 11.50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
రేపు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నేడు రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ..!
By admin1 Min Read