భారత జీడీపీ వృద్ధి రేటు గత రెండేళ్ల కనిష్టానికి పడిపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి నూతన ఆలోచనలు, నూతన వ్యాపార ఒప్పందాలు ఆవశ్యకమని అన్నారు. కేవలం కొందరు బిలియనీర్లు మాత్రమే ఆర్థిక ప్రయోజనాలు పొందుతాన్నారని దీంతో ప్రగతి సాధ్యం కాదని అన్నారు. అందరికీ సమానంగా ముందుకు వెళ్లే అవకాశం లభిస్తేనే, మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. భారత దేశ జీడీపీ వృద్ధి రేటు రెండు సంవత్సరాల్లో అత్యంత తక్కువ స్థాయికి, 5.4% కి చేరుకుంది. రైతులు, కూలీలు, మధ్యతరగతి మరియు పేదలు అనేక ఆర్థిక సమస్యలతో పోరాడుతూనే ఉన్నారని తెలిపారు.
రాహుల్ ప్రస్తావించిన అంశాలు:
రిటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ఠ స్థాయికి 6.21% కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం బంగాళాదుంపలు మరియు ఉల్లిపాయల ధరలు దాదాపు 50% పెరిగాయి. రూపాయి విలువ 84.50 వద్ద తక్కువ స్థాయికి పడిపోయింది. నిరుద్యోగం ఇప్పటికే 45 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టింది.
గత 5 సంవత్సరాల్లో కూలీలు, ఉద్యోగులు మరియు చిన్న వ్యాపారుల ఆదాయం స్థిరంగా ఉంది లేదా గణనీయంగా తగ్గింది.
ఆదాయం తగ్గడం వలన డిమాండ్ కూడా తగ్గింది. 10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన కార్ల విక్రయాల్లో వాటా 2018-19 లో 80% ఉండగా, ఇప్పుడు 50% కంటే తక్కువకు పడిపోయింది.
తక్కువ ధర గల ఇళ్ల మొత్తం విక్రయాలలో వాటా గత సంవత్సరం 38% ఉండగా, ఇప్పుడు సుమారు 22% మాత్రమే ఉంది. ఎఫ్.ఎం.సీ.జీ ఉత్పత్తుల డిమాండ్ ఇప్పటికే తగ్గుతూ వస్తోంది.
కార్పొరేట్ పన్నుల వాటా గత 10 సంవత్సరాలలో 7% తగ్గింది, కానీ ఆదాయ పన్ను 11% పెరిగింది.
నోట్లు రద్దు మరియు జీఎస్టీ ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం వాటా గత 50 ఏళ్లలోనే అత్యల్పం 13%కి తగ్గింది.
కొత్త ఉద్యోగాల అవకాశాలు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వస్తాయి? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆలోచనలు అవసరం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
By admin2 Mins Read