దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ ప్రజల నిర్లక్ష్యం వలన బాధితుల సంఖ్య ప్రతిఏడాది పెరుగుతూనే ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు.చట్టాలంటే ప్రజలకు భయం లేకుండా పోయిందని అన్నారు.రోడ్డు ప్రమాదాల వలన ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారని వ్యాఖ్యానించారు.తానూ కూడా రోడ్డు ప్రమాద బాధితుడినే అని తెలిపారు.ఈరోజు లోక్ సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి లోక్ సభలో సమాధానం ఇచ్చారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…దేశంలో ఏడాది కాలంలో 1.68 లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని… ఇందులో 60 శాతం మంది యువకులే ఉన్నట్లు పేర్కొన్నారు.మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగినట్లు వెల్లడించారు.అందుకే ఈ అంశం తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు.
కాగా ప్రజాప్రతినిధులు,మీడియా,ప్రజల సహకారం లేకుండా రోడ్డు ప్రమాదాలు తగ్గించడం సాధ్యం కాదని
అన్నారు.జరిమానాలు ఎంత పెంచినా ప్రజలు నిబంధనలు పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.రోడ్ ఇంజినీరింగ్,ఆటోమొబైల్ ఇంజినీరింగ్, సమర్థవంతంగా చట్టాల అమలు, ప్రజలకు అవగాహన…ఈ నాలుగు ముఖ్యమైన అంశాలన్నారు.చాలామంది రెడ్ సిగ్నల్ పడితే ఆగకుండా ముందుకు వెళ్ళడం… హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించడం వంటివి చేస్తున్నారని వాపోయారు.నిన్న తన కళ్లముందే ఓ కారు రెడ్ సిగ్నల్‌ను క్రాస్ చేసిందని తెలిపారు.