సుప్రసిద్ధ నటుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) కారణజన్ముడు అని, ఆయన వజ్ర సంకల్పం కలిగిన వ్యక్తి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇవాళ కృష్ణా జిల్లా పోరంకిలో నిర్వహించిన ఎన్టీర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…ఎన్టీఆర్ లో తనకు అన్నిటికంటే బాగా నచ్చేది క్రమశిక్షణ,పట్టుదల,కష్టపడి పనిచేయడం అని అన్నారు.ఈ మూడు ఉంటే జీవితంలో ఎవరైనా పైకి వస్తారని,ఈ మూడింటిని అలవర్చుకోవడమే మనం ఆ మహనీయుడికి అర్పించే నివాళి అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.ఎన్టీ రామారావు గారు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినవారు.ఆయనకు క్యారెక్టర్, కాలిబర్, కెపాసిటీ, కాండక్ట్…ఇవన్నీ ఆయనకు నిండుగా, మెండుగా ఉన్నాయి.లోతుగా గమనిస్తే ఆయన సినిమాల్లోని మాటల్లో,పాటల్లో ఒక సందేశం ఉంటుంది.నటుడిగా,నిర్మాతగా,దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా సినీ చరిత్రలో ఎన్టీఆర్ గారి స్థానం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది.ఆయన ఏకాగ్రత అమోఘం.ఏదైనా ఒకటి అనుకుంటే పూర్తయ్యేదాకా విశ్రమించరు.కొన్ని పాత్రల కోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించేవారు.అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకే చెల్లిందని అన్నారు.
సినీ నటులకు బిరుదులు ఇవ్వడం సాధారణ విషయం.అభిమానులు తమ ఆరాధ్య నటులను పొగుడుకుంటారు.ఎన్టీఆర్ ను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటారు…ఆయన నటన ప్రపంచవ్యాపితం…ఇది వాస్తవం.తెలుగువారి ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి ఎన్టీఆర్.ఆయనకు తెలుగు భాషపై ఉండే అభిమానం నాకు బాగా నచ్చుతుంది.ఆయన తాను స్థాపించిన పార్టీకి కూడా తెలుగుదేశం అని పెట్టుకున్నారు.అప్పట్లో అందరూ…తెలుగుదేశం ఏంటని ఆశ్చర్యపోయారు.అప్పట్లో నన్ను అడిగారు…మీరు తెలుగుదేశంలో చేరతారా అని… లేదయ్యా, నేను భారతదేశంలోనే ఉంటాను అని చెప్పాను.కానీ పార్టీ పెట్టి కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ ను మట్టికరిపించి అధికారంలోకి వచ్చారు.కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మొట్టమొదటగా ఓడించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కింది.ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ పేరిట ఢిల్లీలోనూ కాంగ్రెస్ పెత్తనాన్ని సవాల్ చేశారు.
వెనుకబడిన వర్గాలను కూడా ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.ఎన్టీఆర్ కారణంగా ఒక తరం వారు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. రామారావుకు ఆడపడుచులపై అభిమానం ఉండేది. అందుకే వారికి ఆస్తి హక్కు కల్పించారు… ఈ విషయాన్ని చరిత్ర మర్చిపోదు.మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఆయన ఘనతే.ఆయన జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలి.అందులో ఎలాంటి తప్పులేదు…దీన్ని రాజకీయంగా ఎవరూ తప్పుబట్టే అవకాశం లేదు.రామారావు రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని వెంకయ్యనాయుడు అన్నారు.