భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను, గ్యారంటీలను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే ‘ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ..’ తరహా విధానాలను ఉమ్మడిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దశాబ్దాలపాటు కుటుంబ నియంత్రణ విధానాలు పాటించి, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే స్థితిలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి దక్షిణాదిని శిక్షిస్తున్నారా? అని ప్రశ్నించారు. తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాష్ట్రాన్ని నిలబెట్టేలా తెలంగాణ రైజింగ్ నినాదంతో సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి కార్యాచరణ తీసుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు .ఇటీవల దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి రూ.1.82 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని వివరించారు. పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు అన్ని వర్గాలకు సంక్షేమాన్నీ సమర్ధవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానమని పేర్కొన్నారు. సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ నిలిచిందని వివరించారు. తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయితే అది మన దేశ అభివృద్ధికి ప్రయోజనమని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా ఎందుకు ఉండటం లేదని ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఎందుకు మద్దతుగా నిలవడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
By admin1 Min Read
Previous Articleఉద్యోగులను బలవంతంగా బయటకు పంపిస్తున్న ఐటి కంపెనీలు
Next Article గాజాలో హమాస్ లేకుండా చేస్తాం:- డోనాల్డ్ ట్రంప్