కులం పేరుతో పాస్టర్‌ను దూషించిన కేసులో నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.ఫిర్యాదుదారుడు క్రైస్తవ మతాన్ని స్వీకరించినట్లు తన ఫిర్యాదులోనే పేర్కొన్నందున, షెడ్యూల్డ్ కులాల ఆర్డర్–1950 ప్రకారం ఆయనకు ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేసింది.గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో అక్కల రామిరెడ్డి సహా ఆరుగురిపై ఎస్సీ అట్రాసిటీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టగా, పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.అయితే నిందితులు హైకోర్టును ఆశ్రయించగా,పాస్టర్‌గా పదేళ్లుగా సేవలందిస్తున్న ఆయనకు ఎస్సీ హోదా ఉండదని హైకోర్టు పేర్కొంది.
న్యాయవాది ఫణిదత్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ తీర్పు వెలువరిస్తూ, క్రైస్తవ మతంలో కులవ్యవస్థ లేనందున ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని స్పష్టం చేశారు. తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఆధారంగా కూడా మతం మారిన వారికి రక్షణ కలగదని తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారు చట్టాన్ని దుర్వినియోగం చేశారని అభిప్రాయపడిన హైకోర్టు, గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. మతం మారిన రోజే ఎస్సీ హోదా తుడిపోతుందని ఈ తీర్పు స్పష్టంగా సూచించింది.