టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నివాసంలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించి రూ.2.20 లక్షల విలువైన ఆభరణాలు, రెండు డైమండ్ రింగ్స్ అపహరించాడు. ఈ సంఘటన ఫిలింనగర్ రోడ్ నెంబర్ 8లోని విశ్వక్ ఇంట్లో ఆదివారం వేకువజామున జరిగింది. విశ్వక్ సోదరి వన్మయ తన గదిలో వస్తువులు అస్తవ్యస్తంగా కనిపించడంతో అనుమానం వచ్చి బీరువా తనిఖీ చేసింది. నగలు గల్లంతైనట్లు గుర్తించడంతో కుటుంబసభ్యులకు సమాచారం అందించింది.
తండ్రి కరాటే రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి సమీపంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించగా, ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి 20 నిమిషాల్లోనే చోరీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు వేగంగా విచారణ చేపడుతున్నారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను ఆధారంగా తీసుకుని దొంగను గుర్తించే పనిలో ఉన్నారు. పోలీసులు ఈ చోరీలో ఇంటి విషయాలు బాగా తెలిసిన వ్యక్తి పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు.