స్టార్ నటుడు మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఈ చిత్రాన్ని హిందూ వ్యతిరేక చిత్రంగా అభివర్ణించింది. కాంగ్రెస్ ఈ మూవీకి మద్దతు ప్రకటించగా, బీజేపీ మౌనం వహించింది.ఆర్ఎస్ఎస్ కు చెందిన ‘ఆర్గనైజర్’లో ప్రచురించిన కథనం ప్రకారం, 2002 గోద్రా అల్లర్లను ప్రస్తావిస్తూ హిందూ వ్యతిరేక రాజకీయ ఎజెండాను ఈ చిత్రం ముందుకు తీసుకువస్తోందని ఆరోపించింది. ఈ మూవీ హిందువులను కించపరిచే విధంగా రూపొందించిందని, బీజేపీ వ్యతిరేక కథనాన్ని ప్రచారం చేసేందుకు మాధ్యమంగా మారిందని విమర్శించింది.
భారతదేశంతో పాటు ఉపఖండంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో హిందువులను విలన్లుగా చూపించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, బీజేపీ కేరళ ప్రధాన కార్యదర్శి పీ సుధీర్ మాట్లాడుతూ ఈ మూవీపై పార్టీ స్పందించదని, ప్రేక్షకులే తాము చూడాల్సిన సినిమా ఏదో నిర్ణయించుకోవాలని తెలిపారు. కేరళ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కుట్టతిల్ మూవీకి మద్దతు ప్రకటించారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమాలకు భావ ప్రకటనా స్వేచ్ఛ సమర్థించే వారు ఇప్పుడు ఎంపురాన్‌ను వ్యతిరేకించడం దారుణమని వ్యాఖ్యానించారు.