ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం కొత్త ఫీచర్లను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది.తాజాగా, మాతృ సంస్థ మెటా మరో వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.ఇకపై, యూజర్లు తమ వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్‌ను జోడించుకునే వీలుంటుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉన్న ఫీచర్‌లా, స్టేటస్ ఫొటోలు మరియు వీడియోలకు మ్యూజిక్ జోడించే అవకాశం లభిస్తుంది. అయితే, వినియోగదారులు ముందుగా అందుబాటులో ఉన్న పాటల నుంచే ఎంచుకోవాలి. స్వతంత్రంగా ఇష్టమైన పాటలను అప్‌లోడ్ చేసే అవకాశం ఉండదు.ఈ కొత్త ఫీచర్ గురించి శుక్రవారం వాట్సాప్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “వాట్సాప్ స్టేటస్ ఎప్పటికప్పుడు వినియోగదారులకు తమ జీవితంలోని ముఖ్యమైన క్షణాలను స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు, మీ స్టేటస్ అప్‌డేట్‌లకు సంగీతాన్ని జోడించడం ద్వారా మరింత అనుభూతిని పంచుకోవచ్చు” అని పేర్కొంది.
వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ జోడించే విధానం
వాట్సాప్ యాప్ తెరిచి ‘యాడ్ స్టేటస్’ పై ట్యాప్ చేయాలి.
గ్యాలరీ నుండి ఫొటో లేదా వీడియో ఎంచుకోవాలి లేదా కొత్తగా తీసుకోవచ్చు.
స్క్రీన్‌పై కనిపించే క్రాప్, స్టిక్కర్స్, ఎడిట్ ఆప్షన్లకు పక్కనే మ్యూజిక్ ఐకాన్ కనిపిస్తుంది.
ఆ ఐకాన్‌ను సెలెక్ట్ చేసి మ్యూజిక్ లైబ్రరీ ను తెరవాలి.
అందుబాటులో ఉన్న పాటల నుంచి మీకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు.
ఫొటోలకు 15 సెకన్ల వరకు, వీడియోలకు 60 సెకన్ల వరకు మ్యూజిక్ జోడించుకోవచ్చు. అంతేకాక, ఎంచుకున్న పాటను మీకు కావాల్సిన స్థానం నుండి ప్లే అయ్యేలా సెట్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.ఈ కొత్త ఫీచర్ ద్వారా, యూజర్లు తమ స్టేటస్‌ను మరింత ఆకర్షణీయంగా మరియు వినోదాత్మకంగా మార్చుకునే అవకాశం పొందుతారు.