సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. అల్లు అర్జున్ ను థియేటర్ కు రావొద్దని పోలీసులు చెప్పినా వినకుండా వచ్చారని బాధిత కుటుంబాన్ని కనీసం ఏ ఒక్క సినీ ప్రముఖుడు కూడా పరామర్శించలేదని ఫైర్ అయిన సంగతి తెలిసిందే. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తన వ్యవహారశైలి పై వచ్చిన వార్తలను అల్లు అర్జున్ ఈసందర్భంగా ఖండించారు. తన క్యారెక్టర్ ను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని అన్నారు. ఎలాంటి ర్యాలీ చేయలేదని థియేటర్ కొద్ది దూరంలో తన కారు ఆగిపోయింది. కారు ముందుకు కదల్లేదు. చేయి చూపిస్తూ ముందుకు కదలండని పోలీసులు అంటేనే తాను బయటకు వచ్చి, చేతులు ఊపినట్లు పేర్కొన్నారు. థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ఏ పోలీస్ లోపలికి వచ్చి జరిగిన సంఘటన గురించి చెప్పలేదని అన్నారు. థియేటర్ యాజమాన్యం వచ్చి, జనాలు ఎక్కువగా ఉన్నారని చెబితే, తన భార్యతో కలిసి బయటకు వచ్చేసినట్లు వివరించారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు వరకూ తెలియదని చనిపోయిన ఘటన తెలిసి కూడా ఎలా వెళ్లిపోతాను? నాకూ పిల్లలు ఉన్నారు కదా. మరుసటి రోజు విషయం తెలిసిన తర్వాత బన్నీ వాసుకు ఫోన్ చేసి, ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. చూడడానికి కూడా బయలుదేరదామని సిద్ధమయ్యానని తెలిపారు. కానీ, నాపై కేసు నమోదు చేశారని బన్నీ వాసు చెప్పాడు. నా లీగల్ టీమ్ కూడా వద్దని వారించింది. అందుకే నేను హాస్పిటల్ కు వెళ్లలేదని చెప్పారు.
గతంలో పలువురి హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లిన విషయం గుర్తు చేశారు. తన సొంత అభిమానులు చనిపోతే, వెళ్లి కలవనా? అని ప్రశ్నించారు. జరిగిన ఘటన విషయం తెలిసి షాక్ లో ఉన్నట్లు తెలిపారు. అందుకే ఆలస్యంగా వీడియో పెట్టినట్లు పేర్కొన్నారు.
చాలా ఈవెంట్లు పెట్టాలని అనుకున్నాం. ఈ ఘటన తర్వాత అన్నింటినీ రద్దు చేశామని అల్లు అర్జున్ వివరించారు.
ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారని అయితే తన క్యారెక్టర్ ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఇది మాత్రం మనసుకు తీసుకోలేకపోతున్నాని విచారం వ్యక్తం చేశారు. అందరూ థియేటర్ కు వచ్చి ఆనందించాలని చేయాలని సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ఈ ఘటన విషయంలో బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి పెద్ద అమౌంట్ ఫిక్స్డ్ చేయాలని అనుకున్నాం. అవసరమైతే ఫిజియో థెరపీ చేయించాలని అనుకున్నాం. తెలుగువారు గర్వపడేలా సినిమా చేశానని అనుకుంటుంటే, మనల్ని మనం కిందకు లాక్కుంటున్నామని పేర్కొన్నారు.
ఎవరినీ నిందించేందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టలేదని తమ సినిమాకు ప్రభుత్వం అన్ని రకాలుగా సపోర్ట్ చేసిందని పేర్కొన్నారు. అందుకు ధన్యవాదాలు. కానీ, నాపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు. 22 ఏళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవం ఒక రాత్రిలో పోగొట్టారు. అందుకు బాధగా ఉంది. అంతేగానీ, ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపాలు లేవు. తనకు మానవత్వం లేదనడం సరికాదని అన్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నా, తన వ్యక్తిత్వంపై చేసిన ఆరోపణలన్నీ 100 శాతం అబద్ధమని అన్నారు. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు ఉన్నందున మీ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం చెబుతానని అల్లు అర్జున్ అన్నారు.