జమ్మూకశ్మీర్లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించి తను హామీ ఇచ్చినట్లుగానే ప్రధాని మోడీ మాటనిలబెట్టుకున్నారని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మూడోసారి ప్రధానిగా ఆయన అధికారం లోకి వచ్చిన తర్వాత శ్రీనగర్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పుడు కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని అన్నారు. అన్నట్లుగానే నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. దాని వలనే నేడు తాను సీఎం పదవిలో ఉన్నట్లు తెలిపారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని తమ బాధ్యత నిర్వర్తించారని ఎక్కడా రిగ్గింగ్, అధికార దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదులు లేవని చెప్పారు. ఇక జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తానని ఇచ్చిన హామీని ప్రధాని త్వరలో నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కృషితో సరిహద్దుల్లో శాంతిభద్రతలు కొలిక్కి వచ్చాయని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. పర్యాటకం గానూ కశ్మీర్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారి సోన్మార్గ్ ప్రాంతంలో నిర్మితమైన జడ్-మోడ్ సొరంగాన్ని నేడు ప్రధాని మోడీ ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
మోడీ తన హామీ నెరవేర్చారు: ప్రధానిపై జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు
By admin1 Min Read