బెంగళూరు నగర పౌరులకు అక్కడి మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్‌సీఎల్) షాక్ ఇవ్వనుంది. మెట్రో రైల్ చార్జీలను భారీగా పెంచడానికి రంగం సిద్ధం చేసింది. మెట్రో రైల్ నిర్వహణ ఖర్చులు పెరిగినందున రైల్ చార్జీల ధరలను 30 నుంచి 40 శాతం వరకు పెంచకతప్పటం లేదని, పెంచిన చార్జీలు జనవరిలోనే అమల్లోకి తీసుకొస్తున్నామని తాజాగా ప్రకటించింది.
ఆ రాష్ట్ర రవాణా శాఖ అన్ని క్యాటగిరిల్లోని బస్ చార్జీలను 15 శాతం పెంచిన వెంటనే బీఎంఆర్‌సీఎల్ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవటం అక్కడి ప్రజలని కాస్త షాక్ కు గురి చేసింది. ‘చార్జీల పెంపుదలకు బీఎంఆర్‌సీఎల్ బోర్డ్ దాదాపు ఆమోదముద్ర వేసింది. సవరించిన చార్జీలు త్వరలోనే అమల్లోకి వస్తాయి’ అని బీఎంఆర్‌సీఎల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మెట్రో రైల్ నడవటం లేదని, సంస్థ తీసుకున్న రుణాలు చెల్లించాల్సి ఉందన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.