అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం ప్రకటించారు.ట్రంప్ కార్యవర్గం నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు.ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి పోటీ పడిన విషయం తెలిసిందే.చివరికి రేసు నుంచి తప్పుకున్నారు.ఆ తర్వాత ట్రంప్ గెలుపుకై తీవ్రంగా శ్రమించారు.ఈ నేపథ్యంలోనే తన గెలుపులో కీలక పాత్ర పోషించిన వివేక్ రామస్వామితోపాటు ఎలాన్ మస్క్‌కు తన కార్యవర్గంలో ట్రంప్ కీలక పదవులను కట్టబెట్టారు.
తన కార్యవర్గంలో కీలకమైన డోజ్ (DOGE) (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ) బాధ్యలను వారిద్దరికీ అప్పగించారు.మెరుగైన పాలన,ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించే ఎఫీషియెన్సీ శాఖకు వారిద్దరూ నేతృత్వం వహిస్తారని ట్రంప్ తెలిపారు.అయితే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే రామస్వామి ఈ అనూహ్య నిర్ణయం ప్రకటించడం గమనార్హం.రామస్వామి నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందని తెలిసింది.ఒహైయో గవర్నర్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఒహైయో గవర్నర్ ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్‌లో జరగనున్నాయి.