ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం దేశానికి జరుగుతున్న రాజకీయ పోరుగా భావించాలని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతాల మధ్య పోటీ నెలకొందని.. ఒకటేమో ప్రజాసంక్షేమంపై దృష్టి సారించగా, మరొకటి కొంతమంది సంపన్నులకు ప్రయోజనం చేకూర్చుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు గత ఐదేళ్లలో 400-500 మంది పారిశ్రామికవేత్తలకు చెందిన రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు.
పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎలా ఖర్చు చేయాలో ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి.బీజేపీ మోడల్ ప్రకారం రూ.వేల కోట్ల ప్రజా సొమ్మును ఆ పార్టీ తన సన్నిహితులకు రుణాలుగా ఇచ్చి..ఆ తర్వాత మాఫీ చేస్తుంది. అదే ఆప్ మాత్రం.. సామాన్యులకు మేలు చేకూర్చేలా ఉచిత విద్యుత్,విద్య,వైద్యం,రవాణా సౌకర్యాలపై దృష్టిసారిస్తుంది. ఢిల్లీలోని ప్రతి ఇంటికి నెలకు దాదాపు రూ.25 వేల విలువైన ప్రయోజనాలు అందిస్తుంది’’ అని కేజ్రీవాల్ తెలిపారు.