అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ నుంచి తాను వైదొలగడంపై వివేక్ రామస్వామి స్పందించారు. తనకు డోజ్ అధినేత మస్క్‌తో విభేదాలు తలెత్తాయనే ప్రచారాన్ని కొట్టి పారేశారు. ప్రభుత్వ విభాగాలను మరింత సమర్థవంతంగా పని చేయించడం కోసం విభిన్నమైన విధానాలు అనుసరిస్తారని.. తామిద్దరం ఒకేరకమైన ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు.
తొలుత మస్క్‌తో విభేదాలపై స్పందిస్తూ.. ‘‘మీరు విన్నది సరికాదు. మావి పరస్పరం మద్దతు ఇచ్చే విభిన్నమైన వైఖరులు. నేను రాజ్యంగం చట్టాల ఆధారిత వైఖరిని నమ్ముతాను. మస్క్ టెక్నాలజీ ఆధారిత విధానాలను విశ్వసిస్తారు. అది భవిష్యత్తు ఆలోచనా తీరు. ఇక రాజ్యంగం బలోపేతం గురించి మేము మాట్లాడతాము. కానీ అది కేవలం ఫెడరల్ ప్రభుత్వం మాత్రమే చేయలేదు. రాష్ట్రాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మస్క్‌ను మించి టెక్నాలజీ అప్రోచ్‌ను అనుసరించేవారు మరొకరు ఉండరేమో. మా మధ్య పరస్పరం చర్చలు జరిగాయి. ఇద్దరం ఒకే అంశంపై ఉన్నాం. దేశాన్ని రక్షించడం అనేది ఎవరో ఒకరి వల్ల అయ్యేది కాదు. అందుకే మేమంతా పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.