కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బీఎస్పీ నేత,యూపీ మాజీ సీఎం మాయావతి గట్టి కౌంటర్ ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ వ్యవహరించిందని,దీనితో ఢిల్లీలో బీజేపీ విజయం సాధించింది అని మాయావతి పేర్కొన్నారు.అయితే ఎన్నికల సమయంలో.. ఇండియా కూటమికి బీఎస్పీ మద్దతు ఇవ్వలేదని,ఇది నిరుత్సాహానికి గురిచేసినట్లు ఇటీవల రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.కాగా బెహన్‌జీ తమతో కలిసి పనిచేస్తే,బీజేపీ నెగ్గేది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు ఆమె ఈరోజు బదులు ఇచ్చారు. తన ఎక్స్ అకౌంట్‌లో మాయావతి పోస్టు చేశారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ పనిచేసిందన్న సంగతి అందరికీ తెలుసు అని,దీని వలనే బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు.అందుకే కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరిస్థితిలో ఉందని, కనీసం ఆ పార్టీ అభ్యర్థులకు చాలా చోట్ల డిపాజిట్ కూడా దక్కలేదని ఆమె తెలిపారు. ఇతరుల పట్ల వేలు పెట్టి చూపే ముందు, తన స్వంత వ్యవహారాల గురించి సమీక్ష చేసుకోవాలని రాహుల్ గాంధికి మాయావతి సూచన చేశారు.