ఇకపై అమెరికా వెళ్లేందుకు వీసా, గ్రీన్ కార్డులను దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులతో పాటుగా తమ సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా అందచేయాల్సి ఉంటుందని సమాచారం.ఈ విషయాన్ని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ఈ ఈనెల 5తేదీన ఓ నోటీసులో పేర్కొంది.ఈ మేరకు గ్రీన్ కార్డులు, పౌరసత్వం,ఇతర ప్రయోజనాలు కోరుతూ…దరఖాస్తు పెట్టుకునే భారతీయులు సహా , ప్రతి ఏడాది 35 లక్షల మందికిపైగా విదేశీయుల నుండి ఈ సమాచారాన్ని కోరనున్నట్లు డీహెచ్‌ఎస్ తెలిపింది.
కాగా ఇమ్మిగ్రేషన్ స్క్రీనింగ్‌ను మరింత పటిష్ఠం చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం జనవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన 14161 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో భాగంగా ఈ ప్రతిపాదన ఉంది.కొత్త నిబంధన మేరకు దరఖాస్తుదారులు తొమ్మిది ప్రధాన ఇమ్మిగ్రేషన్ ఫారాలలో తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు అందచేయవలసి ఉంటుంది.అయితే పాస్‌వర్డ్ తెలియచేయవలసిన అవసరం లేదు.ఈ సమాచారాన్ని దరఖాస్తుల గుర్తింపును తనిఖీ చేసేందుకు,జాతీయ భద్రతా ముప్పులను అంచనా వేసేందుకు వినియోగిస్తారు అని తెలుస్తోంది.

